మహారాష్ట్రలో మళ్లీ మునుపటి రోజులు పునరావృతం అవుతున్నాయి. కరోనా వైరస్ అక్కడ వికట్టహాసం చేస్తోంది. వరుసగా ఇప్పటికే మూడు రోజులుగా 6 వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తే.. ఈ జాబితాలో ఆ రాష్ట్ర ప్రముఖులు ఉండటం కలవరపరుస్తోంది. తాజాగా మహారాష్ట్రలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే కరోనా మహమ్మారి బారిన పడిన ఏడో మంత్రి ఈయన.
కరోనా బారినపడిన ఈ విషయాన్ని ఛగన్ భుజ్‌లాల్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా బారినపడ్డప్పటికీ.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. అవసరమైతే హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఛగన్ భుజ్‌బల్ కంటే ముందు ఇదే నెలలో మహారాష్ట్రలో ఆరుగురు మంత్రులు కరోనా బారినపడ్డారు. అనిల్ దేశ్‌ముఖ్, రాజేంద్ర షింగ్నే, జయంత్ పాటిల్, రాజేశ్ తోపే, సతేజ్ పాటిల్, బచ్చుఖాదు ఇప్పటికే కరోనా వైరస్ సోకింది. వారంతా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.