సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తె షూటింగ్‌లో కలకలం రేగింది. చిత్ర యూనిట్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్ర యూనిట్‌కు కరోనా సోకడంతో రజనీకాంత్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆయనకు మాత్రం నెగెటివ్ అని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న నయనతార, కీర్తిసురేశ్, ఇతర నటీనటులు క్వారంటైన్‌లోకి వెళ్లారు.
ఈ నెలాఖరున రాజకీయ పార్టీ వివరాలు ప్రకటిస్తానని గతంలో ప్రకటించారు రజనీకాంత్. దీంతో ఈ సినిమా కోసం రోజుకు 14 గంటల పాటు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా సినిమా షూటింగ్‌ను నిలిపివేయడంతో.. మళ్లీ ఎప్పుడు మొదలయ్యేదానిపై క్లారిటీ లేదు. కనీసం 10 రోజులైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నందున.. కొత్త సంవత్సరంలోనే అవకాశాలున్నాయి.