నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకున్నది. చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. సభా ప్రాంగణానికి దగ్గరలో మురికి కాలువ కూడా ఉంది.
పలువురు కాలువలో పడిపోయగా.. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తొక్కిసలాటలో పలువురు గాయపడగా.. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటన పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై, కన్నీరు పెట్టుకున్నారు. అప్పటికప్పుడు మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.
మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యాసంస్థల్లో చదివిపిస్తామని హామీ ఇచ్చారు. తోపులాట నేపథ్యంలో సభను రద్దు చేసుకున్నారు. బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు చంద్రబాబు.
మృతులు : దేవినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), కలవకూరి యానాది (కొండమూడుసుపాలెం), యాటగిరి విజయ (ఉలవపాడు), కాకుమాని రాజా (కందుకూరు), మరలపాటి చినకొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు)