దేశ రక్షణ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న సైనికుల కోసం ఓ 70 ఏళ్ల వృద్ధుడు తనకున్న ఆస్తినంతా దానం చేసి అందరి చేత శెహబాష్ అనిపించుకుంటన్నాడు. సూర్యాపేట జిల్లా హూజూర్ నగర్ కు చెందిన శ్రీపురం విశ్వనాథం కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవించేవాడు. విశ్వనాథంకు భార్యా పిల్లలు ఎవరూ లేరు. వయసు మీదపడడంతో ఆర్నెల్ల క్రితం దుకాణాన్ని మూసివేసి మఠంపల్లి లోని వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. తన జీవితంలో సంపాదించిన 50 లక్షల రూపాయలను దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులకు ఇవ్వాలనుకున్నారు. వెంటనే జిల్లా సైనికాధికారిని కలిసి ఈ విషయం చెప్పాడు. జిల్లా సైనికాధికారి, ఇతర సైనికాధికారుల సలహా మేరకు నేరుగా హైదరాబాద్ వెళ్లి గవర్నర్ తమిళిసైకి 50 లక్షల చెక్కును అందజేశారు. తన మిత్రుడు ఒకరు సైన్యంలో ఉన్నారని..ఆ కారణంగానే సైనిక సంక్షేమానికి దానం చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. గవర్నర్ కు చెక్కు అందజేసి తిరిగి మట్టంపల్లిలోని వృద్ధాశ్రమానికి వెళ్లిపోయారు.