మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ.. సిద్ధి ప్రాంతంలో ఓ ట్రక్కు.. మరో రెండు బస్సులను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బస్సుల్లోని ప్రజలు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ర్యాలీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ బఘాడా గ్రామానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వెళుతున్న ట్రక్కు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో, అదుపు తప్పి రెండు బస్సులను బలంగా ఢీకొట్టిందని తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.