మహారాష్ట్ర షిర్డీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన నాసిక్ జిల్లా పథారే సిన్నార్ సమీపంలో నాసిక్-షిర్డీ రహదారిపై జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ నాథ్ థానే ప్రాంతానికి చెందిన 50 మంది సాయిబాబా భక్తులు బస్సులో షిర్డీ బయలు దేరారు. పథారే ప్రాంతంలో బస్సు-లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది చనిపోయారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సిన్నార్ గ్రామీణ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పందించారు. మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ ప్రమాదంపై నాసిక్ డివిజనల్ కమిషనర్ ను ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నాసిక్, షిర్డీ ఆస్పత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.