హర్యానాలోని యమునా నగర్ లో బుధవారం సాయంత్రం రావణ దిష్టిబొమ్మల దహనం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. విజయదశమిని పురస్కరించుకుని స్థానికులు భారీ దిష్టిబొమ్మలను దహనం చేస్తుండగా 70 అడుగుల ఎత్తున్న ఒకటి మండుతూనే కింద పడిపోయింది. దీంతో దీనికి దగ్గరగా ఉన్నవారిలో చాలామందికి ఒళ్ళు కాలి గాయాలయ్యాయి.
కొందరు ముందే తప్పించుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఏమైనా.. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎంతమంది గాయపడిందీ తెలియలేదు. అక్కడే కొందరు టపాసులు కూడా కాల్చడంతో దాదాపు తొక్కిసలాట వంటిది జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని గుంపులను చెదరగొట్టారు.
#WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH
— ANI (@ANI) October 5, 2022
ప్రాణ నష్టం జరగలేదని ఆ తరువాత వారు తెలిపారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో అనేక చోట్ల రావణ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏడాదీ దేశవ్యాప్తంగా దసరా పండుగ సంబరాలు మిన్నంటుతాయి. విజయదశమి రోజున రావణ, కుంభకర్ణ, మేఘనాథుడి దిష్టి బొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.