– పలు రాష్ట్రాల్లో కుండపోత
– ప్రమాద హెచ్చరికలు..జనం తరలింపు
నైరుతి రుతుపవనాలతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నదులు, జలాశయాలు పొంగి పొర్లు తున్నాయి.
గుజరాత్ లో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో నవసరి,వల్సాద్ జిల్లాల్లో సుమారు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రాష్ట్రంలో ఓర్సాంగ్, కావేరి, అంబికా నదుల్లో నీటి మట్టం పెరగడంతో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు.
కర్ణాటకలో పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ,ఉడిపి జిల్లాల్లో బుధవారం వరకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది.కొదాడు, చిక్ మగ్లూర్, షిమోగా, హవేరీ, దార్వాడ్, బెలగాం జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
Advertisements
చండీగఢ్ లోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మహారాష్ట్రలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.గత నాలుగు రోజులుగా ముంబైని వర్షాలు ముంచెతుతున్నాయి. పలు చోట్ల ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి.