కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఇప్పటికీ థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. మరోవైపు కరోనా వచ్చి తగ్గిన బాధితుల్లో ఈ మహమ్మారి రకరకాల ప్రభావాలు చూపిస్తోంది. ఈ వైరస్ సాధారణ లక్షణాలు తగ్గినప్పటికీ మానవ శరీరం పై మరిన్ని సరికొత్త ఎఫెక్టులను చూపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. గత నెల రోజులుగా కోవిడ్ 19 బారిన పడి కోలుకున్న రోగులలో కొత్త కొత్త సమస్యలు గమనించారు వైద్యులు.
అందులో కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడి సుదీర్ఘకాలం మందులు వాడుతున్న వ్యక్తులలో ముక్కు మూసుకుపోవడం, తల తిరిగినట్లు అవడం, వినికిడి లోపం, చెవిలో ఒక శబ్దం రావడం… ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనాతో సుదీర్ఘ కాలం బాధపడుతున్న వ్యక్తులలో దాదాపు పది అవయవాలను ఈ మహమ్మారి ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది.
రోజురోజుకు కరోనా బాధితుల్లో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కోవిడ్ వైరస్ ముక్కులో ఉండే నాసోపారింజియల్ లేదా ఒరోఫారింజియల్ అనే కణజాలంలో దాక్కుంటుంది. ఈ ఎఫెక్ట్ తోనే ఎగశ్వాస కోసంపై ప్రభావం పడుతుంది. కరోనాతో ఎక్కువ కాలం బాధపడిన వాళ్లలో వాసన కోల్పోవడం (అనోస్మియా), వాసన పెద్దగా తెలియకపోవడం (కాకోస్మియా), వాసన తగ్గడం (హైపోస్మియా) వంటి లక్షణాలు కన్పిస్తాయి. అది కొన్ని రోజులు అయితే పర్లేదు. కానీ ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం మంచిది.