మరో వారం రోజుల్లో విడుదలకావాల్సిన శాకుంతలం సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా వాయిదా పడిన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త విడుదల తేదీ లాక్ అయింది. ఏప్రిల్ 14న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. శాకుంతలం లీడ్ రోల్ పోషించిన మైథలాజికల్ మూవీ ఇది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కింది శాకుంతలం సినిమా. ఇందులో దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించాడు. దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పటికే ప్రచారం మొదలైంది. పాటల విడుదల కార్యక్రమం కూడా దశలవారీగా నడుస్తోంది. అయితే గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తికాకపోవడంతో సినిమాను వాయిదావేశారు.
అలా వాయిదా వేసిన సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తొలిసారి బాలనటిగా పరిచయమౌతోంది.
నిజానికి ఏప్రిల్ 14న చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అదే టైమ్ కు శాకుంతలం సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే, భోళాశంకర్ విడుదలపై మేకర్స్ వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది.