తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే షార్ లో పనిచేస్తున్న ఇద్దరు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు చెట్టుకు వేలాడుతూ కనిపించగా.. మరొకరు రివాల్వర్ తో పేల్చుకోవడంతో రక్తపు మడుగులో పడి ఉండడం కలకలం సృష్టించింది.
ఇక డీటైల్స్ లోకి వెళితే..తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఆదివారం రాత్రి ఓ జవాను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. సోమవారం రాత్రి ఎస్ఐ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 గంటల్లోనూ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మహాస్‌మాండ్ జిల్లా శంకర గ్రామానికి చెందిన 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధుల్లో చేరారు.
ఇటీవల నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవులపై సొంతూరుకు వెళ్లి ఈ నెల 10న తిరిగి వచ్చారు చింతామణి. షార్‌లోని పీసీఎంసీ రాడార్-1 ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట షిఫ్ట్‌కు హాజరయ్యారు. రాత్రి 7.30 గంటలకు సెట్‌లో కంట్రోల్ రూమ్‌తో మాట్లాడి ఎలాంటి ఘటనలు లేవని సమాచారమిచ్చారు. ఇంతలోనే క్యూఆర్టీ విభాగం రాత్రి 8.30 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తూ చెట్టుకు వేలాడుతున్న చింతామణి మృతదేహాన్ని గుర్తించింది. కుటుంబ సమస్యలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
ఇక ఈ ఘటన గడిచి 24 గంటలు గడవక ముందే సోమవారం రాత్రి షార్ మొదటి గేటువద్ద కంట్రోల్ రూమ్‌లో సి-షిఫ్ట్‌లో విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ వికాస్‌సింగ్ తన వద్దనున్న పిస్తోలుతో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పేలిన శబ్దంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న సహచర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేసరికి వికాస్‌సింగ్ రక్తపు మడుగులో పడున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇక ఈ రెండు సంఘటనలతో షార్ సిబ్బంది తీవ్ర షాక్ లోకి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.