మహిళా హత్య కేసును ఛేదించారు అమనగల్ పోలీసులు.
ఈమేరకు మీడియా ముందుకు వచ్చారు షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మండలం మాలేపల్లి గ్రామ సమీపంలో జరిగిన మహిళ దారుణ హత్యను ఒక్క రోజులో పోలీసులు ఛేదించారు. షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం…మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన కొమ్ము పోచమ్మ వయస్సు 35 సంవత్సరాలు. భర్త గాలయ్య కు 38 సంవత్సరాలు.
అయితే గత 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ లోని గోషామహల్ లో స్వీపర్ గా పనిచేస్తుంది పోచమ్మ. కరోనా లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లుగా చంద్రయాన్ పల్లి గ్రామం నుండి ప్రతిరోజు హైదరాబాద్ కి వెళ్లి వస్తుండేది. రోజు మాదిరిగానే 14.09.2021 తెల్లవారు జామున 4 గంటలకు బయలుదేరి గోషామహల్ కి వెళ్ళింది. అయితే డ్యూటీ ముగించుకొని అదే రోజు సాయంత్రం ఆమనగల్ కు చేరుకొని తన గ్రామానికి వెళ్ళుటకు ఆటో స్టాండ్ వద్ద ఉండగా… గతంలో పరిచయం ఉన్న ఆమనగల్ లో చికెన్ సెంటర్ నడుపుకునే, సాకిబండ తాండకి చెందిన నేనావత్ జైపాల్ నాయక్ అనే వ్యక్తి పోచమ్మను బండి ఎక్కించుకున్నాడు. మాలేపల్లి గ్రామ శివారులోని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి… మాటిమాటికి ఫోన్ చేసి డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అని గొడవపడి కత్తితో గొంతుకోసి హత్య చేశారు.
ఎవరికీ అనుమానం రాకూడదని ఆభరణాలు దొంగలించుకొని వెళ్ళాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆమనగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కాల్ డేటా ఆధారంగా జైపాల్ నాయక్ ను అదుపులోకి తీసుకొని విచారించగా… చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీనితో నిందితుడిని అరెస్టు చేసి, అతడు దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించారు పోలీసులు.