రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో మొగలిగిద్ద గ్రామ శివారులో గత నెల 22వ తేదీన ఓ వ్యక్తిని హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఈ మిస్టరీ కేసుని షాద్ నగర్ పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లో నివాసముండే నిందితుడు శ్రీకాంత్ తన వద్ద పనికి వచ్చే వారి పేరుపై క్రెడిట్ కార్డులు, లోన్లు తీసి జల్సాలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఇదే తరహాలో నిందితుడు శ్రీకాంత్ దగ్గర పని చేసేటందుకు మృతుడు భిక్షపతి కొన్ని రోజుల క్రితం పనిలో చేరాడు.
అయితే వెళ్లిన కొద్ది రోజులకే భిక్షపతి ఇంటి మీద శ్రీకాంత్ ఐసిఐసిఐ బ్యాంక్ లో రూ.50 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుని నామినీగా తన పేరు పెట్టాడు. ఇక ప్లాన్ ప్రకారం నిందితుడు శ్రీకాంత్ భిక్షపతి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మాలని ప్రపోజల్ పెట్టాడు. తన పేరు మీద ఉన్న ఇల్లును అమ్మకానికి.. భిక్షపతి ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా అతన్ని తప్పించి ఇల్లుతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయలని పథకం పన్నాడు శ్రీకాంత్.
ఉపాయం కోసం ఎస్ వోటీ మల్కాజిగిరి నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతిలాల్ ను సహాయం కోరాడు. అతనికి రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. అలాగే సాయం చేస్తే సతీష్, సమ్మయ్యలకు చెరో రూ.5 లక్షలు ఇస్తానని చెప్పాడు. నలుగురు పథకం ప్రకారం భిక్షపతిని కారులో ఎక్కించుకుని బాగా మద్యం తాగించారు.
షాద్ నగర్ పరిధిలో మొగలిగిద్ద గ్రామ సమీపంలో హాకీ స్టిక్ తో భిక్షపతిని కొట్టి అనంతరం కారుతో తొక్కించి చంపి.. యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. అయితే భిక్షపతి మృతిపై అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా అసలు నిజం బయట పడింది. నిందితుడు శ్రీకాంత్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.