ఉన్నతమైన ఉద్యోగాలను వదిలిపెట్టి రాజకీయాల్లో చేరిన వాళ్లను సహజంగా చూస్తాం. అంతేకాదు ఎన్నికలలో పోటీ చేసి పదవులు చేపట్టిన వాళ్లను చూస్తుంటాం. కానీ.. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓ యువ ఐఏఎస్ అధికారి సర్వీస్ కు రాజీనామా చేసి సొంతంగా ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే.. తాను రాజకీయాల్లో సంతోషంగా ఉండలేక పోతున్నానని.. తిరిగి సివిల్ సర్వీసులోకి వస్తున్నట్లు ప్రకటించారు.
2009 బ్యాచ్ యూపీఎస్‌పీ టాపర్ షా ఫైజల్ 2019 ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామ చేశారు. అయితే ఆయన రాజీనామాను ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ ఆమోదించలేదు. కాగా.. షాఫైజల్ తిరిగి సర్వీస్‌లో చేరనున్నట్లు కేంద్ర హోంశాఖ ఏప్రిల్ 28న ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు షా ఫైజల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
తన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లు ట్వీట్ ద్వారా ఫైజల్ తెలిపారు. 8 నెలల ఉద్యోగ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో స్నేహితులు, ఉద్యోగం, ప్రాతినిధ్యం, ప్రజా విశ్వాసం అన్ని కోల్పోయినట్లు చెప్పారు.
అయితే తన భావజాలం తనను కొంత దెబ్బ తీసినప్పటికీ.. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదని స్పష్టం చేశారు. ఎదురు దెబ్బలు మనల్ని బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు. మరొక అవకాశం ఎప్పుడూ విలువైందే అని నమ్ముతానని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి మొదటి యూపీఎస్‌సీ టాపర్ ఫైజల్.. 2009 యూపీఎస్‌సీ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రచారంలోకి వచ్చారు.
2019లో ఎనిమిది నెలల పాటు ఉద్యోగం చేసిన అనంతరం.. కశ్మీర్‌లో ముస్లింల హత్యలు ఆగడం లేదని.. ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ముస్లింలను అణచివేస్తున్నారనే కారణాలతో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశానని వెల్లడించారు. ఆ తర్వాత ‘జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్’ అనే ప్రాంతీయ పార్టీని స్థాపించానని స్పష్టం చేశారు.