బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. షారూఖ్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్‌గా నటించారు. ప్రస్తుతం ‘పఠాన్’ ప్రమోషనల్ కార్యక్రమాలతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో షారూఖ్ ఖాన్ తన సోషల్ మీడియా మాధ్యమంలో #AskSRK సెషన్‌ను నిర్వహించి.. అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఇందులో తన ఫ్యాన్స్, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు. అలాంటి ప్రశ్నల్లో ఓ ప్రశ్న దానికి షారూఖ్ ఖాన్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఓ అభిమాని షారూఖ్‌తో ‘హాయ్ సర్, మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌కి వస్తారా?’ అని ప్రశ్నించాడు. దానికి షారూఖ్ ఖాన్ సమాధానం చెబుతూ ‘తప్పకుండా.. అయితే నన్ను రామ్ చరణ్ తీసుకెళితేనే వస్తాను’ అన్నారు. షారూఖ్ ఇచ్చిన సమాధానం.. అందులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన ప్రస్తావించటం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ షారూఖ్ ఖాన్, రామ్ చరణ్ ఇలా వారి అభిమానులను సర్‌ప్రైజ్ చేయటం ఇదేమీ కొత్త కాదు.
జనవరి 10న ‘పఠాన్’ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రామ్ చరణ్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. అప్పుడు షారూఖ్ స్పందన సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా ఆయన రామ్ చరణ్ గురించి ప్రస్తావించటం ఇంటర్నెట్‌లో మరోసారి వైరల్ అవుతోంది.