పాకిస్తాన్ యంగ్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఓ ఇంటివాడయ్యాడు. మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. కరాచీలో జరిగిన సెర్మనీలో అన్షాను పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తో పాటు అనేక మంది క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. వివాహం తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.
గత ఏడాదే అన్షాతో షాహీన్ ఎంగేజ్మెంట్ జరిగింది. లాహోర్ క్వలాండర్స్ జట్టు పెళ్లికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది. బాబర్ ఆజమ్, సర్ఫరాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్, నసీమ్ షాలు ఈ పెళ్లికి హాజరయ్యారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ సమయంలో షాహీన్ అఫ్రిదికి మోకాలి గాయమైన విషయం తెలిసిందే.
22 ఏళ్ల క్రికెటర్ చాలా రోజుల పాటు రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. ఓ దశలో క్రికెట్ ను వీడాలనుకున్నానని, కానీ తన వీడియోలను యూట్యూబ్ లో చూసుకుని మోటివేట్ అయినట్లు షాహీన్ తెలిపాడు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 8వ ఎడిషన్ లో లాహోర్ జట్టు తరపున షాహీన్ ఆడనున్నాడు.
గత ఏడాది షాహీన్ నేతృత్వంలోని లాహోర్ జట్టుకు పీఎస్ఎల్ టైటిల్ దక్కింది. ప్రస్తుతం షాహీన్-అన్షాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సహచర క్రికెటర్లతో పాటు పలువురు నెటిజన్లు కొత్త దంపతులకు విషెస్ చెబుతున్నారు.