పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో రెండు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్న వందలాది మహిళలు ఆదివారం ర్యాలీగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి బయలు దేరారు. వివాదస్పద చట్టంపై కేంద్ర మంత్రితో మాట్లాడాలనుకున్నారు. అయితే నిరసనకారులు మంత్రిని కలవడానికి ఎలాంటి అనుమతి లేకపోవడంతో వారి ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. మంత్రితో అప్పాయింట్ ఇప్పిస్తామని…అప్పాయింట్ దొరికిన తర్వాత అనుమతిస్తామని నచ్చజెప్పడంతో తిరిగి వెళ్లి నిరసన దీక్షలో కూర్చున్నారు.
నిరసనకారుల ప్రతినిధులతో మాట్లాడి హోం మంత్రి అమిత్ షా తో అప్పాయింట్ ఏర్పాటు చేస్తామని చెప్పాం…కానీ వారందరూ కలుస్తామంటున్నారు అని పోలీస్ అధికారి చెప్పారు. గురువారం జరిగిన టైమ్స్ నౌ సదస్సులో షహీన్ బాగ్ నిరసనకారులతో చర్చలకు సిద్ధమని హోం మంత్రి బహిరంగ ఆహ్వానం పలకడంతోనే తాము కలవాలనుకుంటున్నట్టు నిరసనకారులు తెలిపారు.
సీఏఏ పై ఎవరికి ఎలాంటి సందేహాలున్నా నా ఆఫీసులో అపాయింట్ మెంట్ తీసుకొని వస్తే మూడు రోజుల్లో కలుస్తానని అమిత్ షా టైమ్స్ నౌ సదస్సులో తెలిపారు. అయితే ప్రతినిధి బృందంతో కాకుండా అందరం ర్యాలీగా వెళ్లి అమిత్ షా ను కలుస్తామంటున్నారు షహీన్ బాగ్ నిరసనకారులు. అందరి ముందే మాట్లాడతాం…ఎన్.ఆర్.సి, సీఏఏ లను ఉపసంహరించుకుంటామని రాత పూర్వక హామీ తీసుకుంటామన్నారు 76 ఏళ్ల మహిళ.