షారూక్ ఖాన్, గౌరీఖాన్ ది మంచి జంట. బాలీవుడ్ లో ఇప్పటికీ ఎప్పకిటీ వీళ్లదే ఎవర్ గ్రీన్ జోడీ. ఓవైపు షారూక్ సినిమాలతో దూసుకుపోతుంటే, ఇంటీరియర్ డిజైనర్ గా గౌరీ ఖాన్ తన స్టయిల్ లో కెరీర్ లాగిస్తున్నారు. వీళ్లది ప్రేమ వివాహం.
ఈసారి వాలంటైన్స్ డే సందర్భంగా తమ తొలి ప్రేమ సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు షారూక్. మరీ ముఖ్యంగా ఇద్దరూ కలిసి జరుపుకున్న తొలి వాలంటైన్స్ డే మధుర జ్ఞాపకాల్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఆ రోజులు ఇప్పటికీ తన కళ్లముందు ఉన్నాయంటున్నాడు.
గౌరీతో జరుపుకున్న తొలి వాలంటైన్స్ డే రోజున, ఆమెకు ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ కానుకగా ఇచ్చాడట షారూక్ ఖాన్. అప్పటికి తన స్తోమత అంతేనని తెలిపాడు. ఆ ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ ఇచ్చేందుకు తను చాలా కష్టపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు.
అయితే ఇచ్చింది ప్లాస్టిక్కా లేదా బంగారమా అనేది అనవసరం. తొలి గిఫ్ట్ ఎవరికైనా మధుర జ్ఞాపకమే. అలా గౌరీ ఖాన్ కు ఆ ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయి. ఇక ఈ వాలంటైన్స్ డే కు తనకు అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని అంటున్నాడు షారూక్. పఠాన్ సినిమాను పెద్ద హిట్ చేసి, తనకు చిరకాలం గుర్తుండిపోయేలా చేశారని చెప్పుకొచ్చాడు.