ఒక్కొక్కరి పేర్లు గుర్తుంచుకుంటాం.. మా పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సంగతి చెబుతాం.. ఇవీ ఈ మధ్య ప్రతిపక్షానికి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు. అధికారులకు ఇస్తున్న వార్నింగులు. రీసెంట్‌గా కూడా.. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మొన్న ఏపీలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పోలీసులకు ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఆ నేతలంటే ప్రతిపక్షంలో ఉన్నారు.. అలాంటి మాటలు మాట్లాడారంటే ఓ అర్థం ఉంది. కానీ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి.. పదవి రాగానే ప్రభుత్వ అధికారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. తనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన షేక్‌పేట ఎమ్మార్వోని బదిలీ చేయించారు.
మేయర్ పదవి చేపట్టకముందు .. కొద్ది రోజుల కిత్రం బంజారాహిల్స్ ఉన్న షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీసులో విజయలక్ష్మి హల్‌చల్ చేశారు. తాను అడిగినట్టు కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని బెదిరించారు. అలా ఇవ్వడం కుదరన్నందుకు శ్రీనివాస్ రెడ్డిపై చిందులు తొక్కారు. దీంతో ఆయన.. విజయలక్ష్మిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బండ బూతులు తిట్టడంమేగాక, విధులకు ఆటంకం కలిగించారని.. కోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారని కంప్లెయింట్‌లో రాశారు. ఆ కేసు సంగతి తేలలేదు కానీ.. విజయలక్ష్మి మాత్రం మేయర్ పీఠం ఎక్కారు. తన మాట వినని ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డి ccl కు బదిలీ చేయించారు.
నిజాయతీగా మేయర్ బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చిన విజయలక్ష్మీ.. వారం కూడా తిరక్కముందే.. అధికారులపై కక్షసాధింపు చర్యలకు దిగారంటూ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవి చేపట్టడం అధికారులపై పగ తీర్చుకోవడానికేనా అంటూ వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తన మాట వినకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని అనుచరుల, సన్నిహితులకు వద్ద చెప్తున్నారట విజయలక్ష్మి.