వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి తాజాగా షకీల్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న వైనం ఎలాంటి నష్టం కలిగించబోతోంది? మిషన్ ఆకర్షణ్.. కు ప్రస్తుతానికి వాళ్లు బ్రేకిస్తారా.. లేక మరింత దూకుడు పెంచుతారా? ఇంతకీ షకీల్ అటా.. ఇటా.. తెల్లారేసరికి ఎందుకు మారిపోయాడు..? ఏ మందు పనిచేసింది?
హైదరాబాద్: కేంద్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వివిధ పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకుంది. టీఆర్ఎస్‌లో టికెట్ దక్కని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, వివేక్‌తో పాటు అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే పోమారం సత్యనారాయణ, మరికొందరు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకులు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్ లాంటి వారు కూడా బీజేపీలో చేరారు. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో తనకు అన్యాయం జరిగందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలకు వ్యాల్యూ లేదని స్టేట్మెంట్ ఇచ్చిపడేశారు. దట్టూ.. టీఆర్ఎస్ అక్కడ ఎంఐఎం మాట వింటోందని, ఇలాగైతే ఎలాగని అనేశారు. టీఆర్ఎస్‌లో గెలిచిన ఒకే ఒక్క మైనారిటీ లీడరుకి మంత్రి పదవి ఇవ్వకపోతే ఎలాగంటూ మనసులో మాట కక్కేశారు. ఇదంతా నిన్నటి మాట. మరి ఏం జరిగిందో ఏమో. టీఆర్ఎస్ బిగ్‌బాస్ తనయ కవితకు అనుచరుడిగా వుండే షకీల్ తెల్లారేసరికి ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బే.. నేను టీఆర్ఎస్ ఎందుకు వదిలి వెళ్తానని మాట మార్చేశారు. సోమవారం తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్న పెద్దమనిషి ఎందుకు ఫేస్ టర్నింగ్ ఇచ్కుకున్నారో తన ఫాలోవర్లకే అర్ధం కాలేదు.
ముందు అందిన సమాచారాన్ని బట్టి షకీల్ బీజేపీలో చేరడం ఖాయం చేసుకున్నారు. షకీల్‌పై అనేక పాత కేసులు ఉన్నాయి. వాటి చుట్టూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తుందన్న ప్రచారం గత కొద్దిరోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్‌తో షకీల్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీ వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ మైనార్టీ నాయకులను ఆకర్షించే పనిలో ఉంది. తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు సైద్దాంతికంగా రాజకీయంగా బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటారనేది వాస్తవం. ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో వారి మద్దతు లేకుండా బీజేపీ అక్కడ గెలవడం కష్టమే అని చెప్పాలి. అందువల్లే బీజేపీలో చేరాలనుకునే మైనారిటీ నేతలు కొంత ముందువెనుకా ఆడుతున్నారని బీజేపీ నాయకత్వం గ్రహించింది. దీంతో ముస్లిం మైనార్టీ నాయకులను టార్గెట్ చేసింది. పెద్ద సంఖ్యలో వారిని పార్టీలో చేర్చుకోవాలని భావించింది. మైనార్టీ నేతలో రాష్ట్రీయ్ స్వయం సేవా సంఘ్ (RSS) ప్రముఖులు సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని రకాలుగా మీకు పార్టీలో భరోసా కల్పిస్తామని వారు హామీలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే షకీల్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. ఒక వైపు ఆయనపై ఉన్న పాత కేసులు.. మరోవైపు పార్టీ అధినాయకత్వంపై ఉన్న అసంతృప్తిని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుంది. షకీల్ ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చినా మరికొందరు టీఆర్ఎస్ మైనార్టీ నాయకులతో కూడా బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఐడీసీ మాజీ ఛైర్మన్ బుడాన్ బేగ్‌తో ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడి బీజేపీలో చేరాలని కోరినట్టు సమాచారం. మైనార్టీ నాయకులను పెద్దఎత్తున చేర్చుకోవడం ద్వారా బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న భావన కల్గించాలన్నదే ఆపార్టీ ఆలోచన. దాంతో ఇతర వర్గాల వారు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతారనేది బీజేపీ వ్యూహంగా కూడా కనబడుతుంది.
ఈ తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ తన దూకుడును పెంచినట్లు అనిపిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్‌లో అసమ్మతి ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపించారు. పార్టీ అధినాయకత్వం వారిని బుజ్జగించినా… బలవంతంగా వారితో వివరణ ఇప్పించారని అర్థం అవుతుంది.ఇందుకు మాజీ మంత్రి జోగు రామన్న వ్యాఖ్యలే నిదర్శనం. మొత్తానికి టీఆర్ఎస్‌కు కష్టకాలం వచ్చినట్టే కనిపిస్తుంది. షకీల్ ఇప్పుడు మాట మార్చడంతో ఆ పార్టీకి కాస్త ఊరడింపు అయినప్పటికీ మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతాయో బిగ్‌బాస్ సీజన్ 3 మాదిరి ఎదురుచూడాల్సిందే