సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమా షూటింగ్ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. ప్రస్తుతం దీని గ్రాఫిక్ వర్క్ నడుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఫస్ట్ లుక్, సాంగ్స్ తో సందడి చేస్తుందనుకున్న ఈ సినిమా, అలాంటి హంగామా ఏం చేయడం లేదు. పైపెచ్చు రిలీజ్ డేట్ పై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది.
శాకుంతలం సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తామని దర్శకుడు గుణశేఖర్ ప్రకటించాడు. కానీ ఇప్పుడా తేదీకి సినిమా వచ్చేలా కనిపించడం లేదు. ఈ మూవీ మొత్తం గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ఆ వర్క్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటూ పోతున్నారు. పైగా ఈసారి గ్రాఫిక్స్ పై చాలా పట్టుదలగా ఉన్నాడు గుణశేఖర్. దీనికి ఓ కారణం ఉంది
గతంలో గుణశేఖర్ తీసిన రుద్రమదేవి సినిమాలో కూడా గ్రాఫిక్స్ ఉన్నాయి. అందులో గ్రాఫిక్స్ చాలా చీప్ గా ఉన్నాయనే విమర్శల్ని ఎదుర్కొన్నాడు ఈ దర్శకుడు. అందుకే ఈసారి వీఎఫ్ఎక్స్ పై చాలా సీరియస్ గా ఉన్నాడు. పైగా ఈయనతో పాటు దిల్ రాజు కూడా కలిశాడు కాబట్టి, గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కానక్కర్లేదు.
సో.. ఈ ఏడాది చివరినాటికి సినిమా వచ్చేలా లేదు. తాజా సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా శాకుంతలం సినిమాను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇదొక మైథలాజికల్ మూవీ అనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కూతురు ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ కు పరిచయమౌతోంది.