తమది అణ్వస్త్ర దేశమైనా విదేశీ అప్పుల కోసం దేబిరించడం సిగ్గుచేటని పాకిస్తాన్ ప్రధాని షెహ బాజ్ షరీఫ్ వాపోయారు. ఆర్ధిక సాయం కోసం తాము అడుక్కోవలసిన పరిస్థితి వస్తోందని ఆయన అన్నారు. దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మిత్ర దేశాల నుంచి మరిన్ని రుణాలను కోరుకోవలసి రావడం తనకు ఇబ్బందికరంగా, ఇరకాటంగా మారిందని ఆయన చెప్పారు. ఇది శాశ్వత పరిష్కారం కాబోదన్నారు.
లాహోర్ లో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రొబేషనరీ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ సెరిమనీలో ఆయన మాట్లాడుతూ.. గత 75 సంవత్సరాల కాలంలో దేశంలో వివిధ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కోలేకపోవడం విచారకరమన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఈ దేశంలో రాజకీయ నాయకులో, మిలిటరీ నియంతలో అధికారంలోకి వచ్చినా.. పరిస్థితి మారలేదన్నారు.
విదేశాల నుంచి అప్పులు తీసుకోవడం సరైన పరిష్కారం కాదని, ఆ తరువాతైనా ఈ రుణాలను తిరిగిచెల్లించవలసి ఉంటుందని షరీఫ్ చెప్పారు. పాకిస్థాన్ గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో దేశ ద్రవ్య లోటు 115 శాతం పైగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం సుమారు 24 శాతం మేర పెరిగింది.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా..గుప్పెడు బియ్యం, గోధుమ పిండి కోసం ప్రజలు తమలో తాము ఘర్షణలకు దిగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ .. పాకిస్తాన్ కు రుణాలను మంజూరు చేస్తున్నాయి. తాము మరో వందకోట్ల డాలర్లను అప్పుగా ఇస్తున్నామని యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఇటీవల ప్రకటించారు. సాక్షాత్తూ దేశ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ ఇంత నిస్పృహగా మాట్లాడడం ఇదే మొదటిసారని జియో న్యూస్ పేర్కొంది.