ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు. గత కొంత కాలం నుండి ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాల్ని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ మీడియాకు వివరించారు.
రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని శివరాంపల్లిలో నివాసముండే విజయ్ కుమార్ ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో అతడ్ని బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుడి దగ్గర రూ.10 లక్షల నగదు, ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ముఠాలోని మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు డీసీపీ. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ పై షంషే గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు వివరించారు.
ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జగదీశ్వర్. విజయ్ ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎస్వోటీ పోలీసులకు రివార్డులు అందజేశారు.