అధికార పార్టీ, ప్రభుత్వ అధికారుల అండదండలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మెటల్‌ను ప్రైవేటు వ్యక్తులు వాడుకుని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని శనాయిపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా శనాయిపల్లి గ్రామ ప్రజలకు చెందిన 150 ఎకరాల భూమిని అధికారులు సేకరించారని తెలిపారు.
ఈ భూమిలో ప్రాజెక్టు కోసం తీసుకొచ్చిన మెటల్‌ను డంప్ చేయగా, దాంతో నాగం శేఖర్ రెడ్డి, హనుమంత్ రెడ్డీ, పీపీఆర్ క్రెషర్‌కు చెందిన అక్రమ దందా చేస్తు్న్నారని ఆరోపిస్తున్నారు. తద్వారా వారు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని వివరిస్తున్నారు.
ఐదేళ్లుగా ఈ దోపిడీ జరుగుతున్నదని, ఈ విషయమై స్థానిక ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఈ క్రమంలోనే ఈ అక్రమ దందాను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ శనాయిపల్లి గ్రామస్తులు నిరాహార దీక్షకు కూర్చొన్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరుతున్నారు. అక్రమ దందాకు తెరలేపిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.