చైనాలో కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్న కోవిడ్ మళ్ళీ కోరలు చాస్తోంది. సుమారు రెండు నెలలుగా కరోనా కేసులు దాదాపు లేని ఈ దేశం తిరిగి ఈ మహమ్మారితో సతమతమవుతోంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 1878 కేసులు నమోదయ్యాయి. గత ఆగస్టు 20 తరువాత మళ్ళీ ఇంతగా ఇవి పెరగడం ఇదే మొదటిసారి. వారం రోజుల పాటు నేషనల్ డే హాలిడేస్ రావడంతో ..దేశానికి తిరిగివస్తున్న వారి కారణంగా కేసులు పెరిగినట్టు భావిస్తున్నారు. షాంఘైలో తాజాగా 34 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఎక్కువగా మంగోలియాకు వెళ్లి వస్తున్నవారి వల్లే కరోనా వ్యాపిస్తోందని తెలుస్తోంది. బీజింగ్ నగరంలోకి వీరి రాకను అప్పుడే నిషేధించారు. ఈ వైరస్ అదుపులోకి వచ్చేంతవరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో పరిమిత తాత్కాలిక లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. షాంక్సీ ప్రావిన్స్ లో నాలుగు లక్షల జనాభా ఉన్న యోంగి నగరంలో ఈ నెల 8 నుంచి మూడు రోజుల లాక్ డౌన్ విధించారు. అయితే అనేకమంది సోషల్ మీడియాలో అధికారుల చర్యను తప్పు పడుతున్నారు. మరి కొన్ని రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరగనున్నాయి. దేశంలో జీరో కోవిడ్ పాలసీని కఠినంగా అమలు చేయాలని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆదేశాలు జారీ చేసినందున అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే ఇందుకు చర్యలు తీసుకుంటోంది.
షాంఘై లోని జూ హ్యూ వంటి జిల్లాల్లో లాక్ డౌన్ విధించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడానికి వీలు లేనందున కొన్ని చోట్ల స్థానిక అధికారులు, వలంటీర్లే వారి ఇళ్లకు వెళ్లి ఆహార ప్యాకెట్లను పంచుతున్నారు. ఇక బీజింగ్ సహా అనేక నగరాల్లో క్వారంటైన్ కేంద్రాలను తిరిగి సిద్ధం చేస్తున్నారు. ట్రావెలర్స్ కి టెస్టులను ముమ్మరం చేశారు.