మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన తన అల్లుడు అజిత్ పవార్ చర్య పార్టీకి వ్యతిరేకమైనదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఇది క్రమశిక్షణారాహిత్యమైనదిగా పేర్కొన్నారు. ముంబైలో శివసేన తో కలిసి ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన..తమ పార్టీకి చెందిన నేతలెవ్వరూ బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వానికి మద్దతునివ్వరని తెలిపారు. అజిత్ పవార్ వెంట 10-11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పునరుద్ఘాటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అజిత్ పవార్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అజిత్ పవార్ స్థానంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఈ రోజు సాయంత్రం ఎన్నుకుంటామని చెప్పారు.
ఇదిలా వుండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంపై శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే స్పందించారు. కుటుంబంలో చీలిక అంటూ వాట్సప్ లో పేర్కొన్నారు. ‘మనం ఎవరినైతే నమ్ముతామో, వారు ఎప్పుడూ మోసం చేయరని భావిస్తమో…ప్రేమిస్తామో, సమర్ధిస్తామో…వారి నుంచి ప్రతిఫలంగా ఏం పొందుతామో’ చూడండి అంటూ వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేశారు.