మామా అల్లుళ్లు ఆడిన ఆటకు మహారాష్ట్ర రాజకీయం ఎన్నో మలుపులు తిరిగింది. ఎంతో అనుభవం, చతురత ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన అనుభవాన్ని అంతా రంగరించి ఎన్సీపీని గెలిపించటమే కాదు… ప్రభుత్వ ఏర్పాటులోనూ చివరి వరకు తనేంటో బయటపడకుండా బీజేపీ గద్దెనెక్కే వరకు గేమ్ ఆడి చూపించాడు.
అల్లుడు అజిత్ పవార్‌తో ఓవైపు రాజకీయం నడుపుతూనే ఉన్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీకి శివసేన ఎదురుతిరగ్గానే తన కూతురు ఢిల్లీలో చక్రం తిప్పారు. అమిత్‌షాను కలిసివచ్చారనే వార్తలు ప్రముఖంగా వచ్చాయి. కానీ పవార్ మాత్రం ఎక్కడా నోరు మెదప లేదు సరికదా… బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నట్లు వచ్చారు. ముందు రోజు మోడీని, తర్వాత సోనియాను కలిసి వచ్చినా వ్యతిరేకత రాకుండా చూసుకోవటం ఆయన మేధావితనాన్ని అర్థం చేసుకోవచ్చు.
అయితే, శివసేనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పగానే గంటల వ్యవదిలో రాజకీయం మారిపోవటంలోనూ శరద్ పవార్ వ్యూహాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనపై ఈడీ కేసులు వెయిట్ చేస్తున్నాయి. శరద్ పవార్ అల్లుడు అజిత్ పవార్ మెడపై కూడా కత్తి వేలాడుతూనే ఉంది. అందుకే ఉదయం లేచేసరికే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది.
ప్రాంతీయ పార్టీల్లో ఉండే అల్లుడి వైపు మొగ్గుచూపాలా… తన కన్నబిడ్డల వైపు మొగ్గుచూపాలా అన్న పాయింట్ ఎన్సీపీలోనూ వచ్చింది. పవార్ కూడా మొదట్లో తన కూతురు సుప్రియా సూలే వైపు అడుగులు వేసినా… అజిత్ పవార్ పార్టీని చీల్చే అవకాశం ఉందని వెనక్కి తగ్గినట్లు మహా రాజకీయాలు చూసిన వారికి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు కూడా అజిత్ పవార్ మోడీ పంచన చేరాడని చెప్పటం వల్ల తన పార్టీకి అధికారం దక్కటంతో పాటు తన ప్రతిష్ట అలాగే ఉంటుందని, అల్లుడు మాత్రమే విలన్ అవుతాడని అజిత్ పవార్ ముందుకు తోశాడని స్పష్టంగా అర్థమవుతోంది.
కానీ… అధికారం ఇప్పుడు అల్లుడి చేతిలో ఉంది. అండగా బీజేపీ ఉంది. ఎంత అనుభవం ఉన్న ఒక్కోసారి ఎందుకు పనికిరాదని పవార్ మర్చిపోవద్దంటున్నారు ఎనలిస్ట్‌లు.