నేను తెలుగు భాష లెక్క.. ఆడ ఉంటా ఈడ ఉంటా అని గోన గన్నారెడ్డి డైలాగ్.. కాని పొరపాటున ఆయనకిచ్చారు. కాని ఈయనకే ఇవ్వాలి. ఆయన నిజంగానే దైవాంశ సంభూతుడు. ఎంత దైవాంశ సంభూతుడు కాకపోతే.. ఆయన పుట్టినరోజును ప్రతి దేవాలయంలోనూ జరుపుతారు. అలా జరపాలని స్వయంగా దేవాదాయశాఖ ప్రతి ఈవోకు ఆదేశాలు ఎలా ఇస్తారు చెప్పండి. ఏ మహాత్ముడికి, ఏ పుణ్యాత్ముడికి.. ఎవరికి దక్కని పుణ్యం ఆయనొక్కడికే దక్కుతుంది. అందుకే ఆయన దైవాంశ సంభూతుడు. ఆయనే శారదాపీఠం అధిపతి స్వరూపానందస్వామి.
స్వామి పుట్టినరోజు నవంబర్ 18. ఆ రోజు స్వామివారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ నుంచి ఆలయాల ఈవోలు అందరికీ ఆదేశాలు వెళ్లాయి. శ్రీకాకుళం అరసవిల్లి స్వామి దేవాలయం నుంచి చిత్తూరులోని శ్రీకాళహస్తి వరకు ఆదేశాలు వెళ్లాయి. ఇక తిరుమలలో కూడా అలాంటిదేమైనా ఆదేశాలు టీటీడీ నుంచి ఇస్తారేమో చూడాలి.
స్వరూపానందస్వామి.. సార్ పేరు.. ఎన్నికల ముందు బాగా వినపడింది. అంతకు ముందే ఫేమసే గాని.. రాజకీయాల్లో మాత్రం అప్పుడే వినపడింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డిగారికి హిందూ మత ప్రవేశాన్ని కల్పించిన మహానుభావుడని చెబుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరిగాయి.. తిరుగుతూనే ఉన్నాయి. వాటినెప్పుడూ ఎవరూ అధికారికంగా కన్ ఫామ్ చేయలేదు. చేస్తే మళ్లీ క్రిస్టియన్ల ఓట్లు పోతాయని భయం. ఈ వీడియోలు కావాలని లీక్ చేసి.. హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికి పథకం రచించారు. బాగుంది కదా.. డ్యూయెల్ రోల్.
ఇక స్వామివారిని మొదట సేవించింది మన కేసీఆర్ సారు. ఆయన దగ్గర యాగం చేశాకే.. కేసీఆర్ రెండోసారి కూడా గెలిచారు. అందుకే ఆ తర్వాత వెంటనే జగన్ కూడా అదే యాగం నిర్వహించారు. ఇంకేముంది అంతా కలిసొచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి ముందు స్వామివారి పాదాలకు మొక్కటం కామన్ అయిపోయింది. స్వామి వారికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భూమిని కూడా అర్పించుకున్నారు.. వారి సొంత భూమి కాదు సుమీ.. ప్రభుత్వ భూమి.
జగన్ ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా ముహూర్తం పెట్టేది ఆ స్వామి. అంతెందుకు అసలు విశాఖను రాజధానిగా ఎంపిక చేసింది ఆయనే అంటారు. ఎందుకంటే స్వామివారికి విశాఖలోనే అసలు గ్రిప్.. వ్యవహారాలునూ. అందుకే అక్కడే రాజధాని అయితే.. పక్కనే సీఎం ఉంటే చాలా పనులు అవుతాయి కదా.. అందుకే అలా సలహా ఇచ్చినట్లున్నారు. ఆయన చెప్పినప్పటి నుంచే విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి విశాఖ మొత్తాన్ని స్కాన్ చేసి వ్యవహారాలన్ని చక్కబెడుతున్నారు. స్వామివారి సూచన మేరకే జగన్ చాలా తొందరపడ్డారు విశాఖకు వెళ్లడానికి .. కాని కుదిరి చావలేదు కదా. అందుకే కొన్ని శాంతిపూజలు చేయించినట్లున్నారు. ఇక కొత్త ముహూర్తం కూడా పెట్టే ఉంటారు. మరి అంత పవర్ ఫుల్ కాబట్టే.. ఆ స్వామి పేరుతో పూజలు చేయమని ప్రతి దేవాలయానికి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెళ్లాయి. నిజంగానే ఎంత పవర్ ఫుల్ స్వామి ఆయన. ప్రభుత్వాన్నే తన చేతిలో పెట్టుకున్నాడు కదా. నిజంగా జనం వేస్టు.. వారి చేతుల్లో ఓట్లున్నా ఏమీ చేయలేరు.. ఆయన చూడండి.. ఏమీ లేకుండానే ఎలా ఆడిస్తున్నాడో.