ప్రపంచంలో అతి పెద్ద చేప అయిన వేల్ షార్క్ చాప విశాఖ మత్స్యకారులకు చిక్కింది. అయితే, వారు ఈ విషయాన్ని జిల్లా అటవీ అధికారి అనంత్ శంకర్ కు తెలియజేయటంతో.. దాన్ని మళ్లీ సముద్రంలోకి వదిలిపెట్టారు. తంథాడి బీచ్ లో ఫిషింగ్ నెట్‌లో వేల్ షార్క్ చిక్కుకోవడం కొంతమంది స్థానిక మత్స్యకారులు చూశారు. దీంతో దాన్ని రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు రెండు టన్నులు బరువు ఉన్న ఈ సొరచేపను అటవీ శాఖ అధికారులు, మత్స్యకారులు మరియు వన్యప్రాణుల సంరక్షకులు తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లారు.
మానవులు, వృక్షాల కన్నా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి జీవిస్తున్న జీవుల్లో సొర చేపలు ఒకటి. ఇవి సుమారు 153 రకాలు ఉన్నాయి. అయితే, వాటిలో ఇప్పటికే చాలా రకాలు అంతరించిపోయినట్లు బయోడైవర్సిటీ అధికారులు చెబుతున్నారు. వేటల కారణంగానే.. ఇవి అంతరించిపోయాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, వీటి సంరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.