ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓ ఆటాడుకున్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె చేపట్టి ప్రజాప్రస్థానం పాదయాత్ర 58వ రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆదివారం సుజాతనగర్ మండలం పాత అంజనాపురం క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దారి పొడవునా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు షర్మిల.
సుజాత నగర్ లో నిర్వహించిన రైతు గోస మహా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘‘పల్లా రాజేశ్వర్ అనే ఎమ్మెల్సీ ఉన్నారు. వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.. టీఆర్‌ఎస్ ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడట. మరి.. తప్పుల మీద తప్పులు చేస్తున్న కేసీఆర్ ని దేంతో కొట్టాలి?’’ అని ప్రశ్నించారు షర్మిల.
17 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వేయకుండా అడ్డుకున్నందుకు కేసీఆర్ ను ఏ చీపురుతో కొట్టాలన్నారు షర్మిల. ఇక స్థానిక ఎమ్మెల్యే కొడుకు చేసిన అరాచకానికి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. వారిపై చర్యలు తీసుకోనేందుకు మిమ్మలిని ఏ చీపురుతో కొట్టాలని సెటైర్లు వేశారు.
మరోవైపు సీతంపేట బంజారా, కోమటిపల్లి, చింతల తండా, నిమ్మల గూడెం మీదుగా 58వ రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు షర్మిల. ప్రజలను పలకరిస్తూ.. వారికున్న సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.