తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ ఎంపీ స్థానాలు ఇచ్చారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వై.ఎస్.షర్మిల ఫైర్ అయ్యారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం పున: ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాద యాత్ర 1,000 కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరించింది. షర్మిల ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణలో రైతులకు 60 ఏళ్లు దాటితే బీమా వర్తించబోదని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని షర్మిల తప్పుబట్టారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ కు పట్టడం లేదని ఆరోపించారు.
కేసీఆర్కు ప్రజల బాగోగులు అవసరం లేదని, ఎంత సేపటికీ సంచలనాలు కావాలని విమర్శించారు. పక్క రాష్ట్ర రైతులకు కేసీఆర్ ఆర్థిక సాయం చేయడం చూస్తుంటే అత్త సొమ్ము.. అల్లుడు దానం చేసిందన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సర్కార్ ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని వివరించారు. రూ.860 కోట్లు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోఉన్నాయని, ఆ లెక్కన ఆ పార్టీ నాయకుల అకౌంట్లలో ఎంత డబ్బు ఉంటుందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆమె అడిగారు. ఆంధ్రా సంస్థలను మూసేస్తామని కేసీఆర్ మాట్లాడినపుడు వైఎస్ఆర్ వీసా అనే పదం వాడారని గుర్తు చేశారు.