సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే.. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని విమర్శించారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు, సర్పంచ్ లు ఆత్మహత్యాయత్నాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఇటీవల సీఎం కేసీఆర్ సొంతజిల్లా సిద్దిపేట జగదేవ్ పూర్ మండలానికి చెందిన రైతు దబ్బేట మల్లేశం మృతిపై షర్మిల స్పందించారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యానికి సిద్దిపేటకు చెందిన రైతు ఆత్మహత్యే నిదర్శనమని విరుచుకుపడ్డారు. పంట దిగుబడి లేక, పెట్టిన పెట్టుబడి రాక ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశ లేక మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడని అన్నారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యేనని అన్నారు.
తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, గ్రామపంచాయితీల అభివృద్ధికి సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ లేవు.. కానీ పక్క రాష్ట్రంలో మరణించిన రైతులకు ఇవ్వడానికి ఎక్కడ నుండి వచ్చాయని నిలదీశారు. తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచివ్వడానికీ.. మీ తాత జాగీరా..? అంటూ నిలదీశారు షర్మిల.
11లక్షల అప్పుతెచ్చి పంచాయితి పనులు చేస్తే.. చేసిన పనులకు బిల్లులు రాక.. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఎల్లయ్య చావడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకుండా గ్రామపంచాయితీ సర్పంచ్ లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇక మీ దేశాన్నేలపోవాలన్న దురదకు తెలగాణ బిడ్డల ముంచకు దొరా..! అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల.