తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. ప్రజాప్రస్థానంలో భాగంగా 87వ రోజు వైరాలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఘాటు విమర్శలు, ఆరోపణలతో డైరెక్ట్ అటాక్ చేశారు. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యంలా కల్వకుంట్ల పాలన నడుస్తోందన్నారు.
వైరా రిజర్వాయర్ ను రూ.50 కోట్లతో వైఎస్సార్ మరమ్మతులు చేయించి.. 25 వేల ఎకరాలకు సాగు నీరందించారని షర్మిల అన్నారు. కేసీఆర్ మాత్రం ఎనిమిదేండ్లలో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రజలకు కాలయముడయ్యాడని విమర్శలు గుప్పించారు.
స్థానిక ఎమ్మెల్యే వైఎస్సార్ పేరుతో ఇండిపెండెంట్ గా గెలిచి.. అంగడిలో పశువులా కేసీఆర్ కు అమ్ముడుపోయాడని మండిపడ్డారు. బెల్టు షాపులు, భూకబ్జాలను ప్రోత్సహిస్తూ కేసీఆర్ లా తయారయ్యాడని ఫైర్ అయ్యారు.మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజలు కేసీఆర్ దిక్కుమాలిన పాలనను పాతరేసి, వైఎస్సార్ సంక్షేమ పాలనకు పట్టం కట్టాలి..’ అని పిలుపినిచ్చాారు.
మహానేత వైయస్ఆర్ కు మరణం లేదన్నారు. ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఐదేండ్లలోనే అనేక సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత వైయస్ఆర్ కి దక్కిందని తెలిపారు. మాట తప్పని, మడమ తిప్పని వైయస్ఆర్ బిడ్డగా మాటిస్తున్నానని.. తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలను తిరిగి తీసుకొస్తానని శపథం చేశారు షర్మిల.