వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం కావాలంటే తనని గెలిపించాలని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. ఇందులో భాగంగా షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా ప్రజలు ప్రభుత్వాలకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అమాంతంగా ధరలు పెంచి ప్రజలపై అధికార భారాన్ని మోపుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల పాదయాత్ర 39వ అయిన సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం నుంచి ప్రారంభించారు. దారి పొడవున ప్రజల్ని పలకరిస్తూ.. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వైఎస్ షర్మిల ముందుకు సాగారు. ప్రజల కోసం సంక్షేమ పథకాల అమలు కోసం రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చేస్తున్నట్లు చెప్పారు. యువకులు, మహిళలు, రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు అన్నీ వర్గాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని షర్మిల ఆరోపించారు.
పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ తిరుమలగిరి నియోజకవర్గం గుండెపురి గ్రామంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు షర్మిల. రోడ్లపై కట్టెలతో వంట చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు ఓట్లేసి గెలిపిస్తే.. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. ఇంకోసారి అవకాశం ఇచ్చినా ఫలితం ఉండదన్నారు వైఎస్ షర్మిల.
అలాగే, 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 80 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం మోసం కాదా అని షర్మిల ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల పరిస్థితి ఏంటని షర్మిల ఈ సందర్భంగా నిలదీశారు.