ప్రజాప్రస్థానం పేరుతో వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే.. అక్కడి ఎమ్మెల్యేలను ప్రజా సమస్యలపై నిలదీస్తున్నారు. పనిలోపనిగా తనపై గతంలో చేసిన విమర్శలకు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జోగిపేట పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మండిపడ్డారు. ఆయన భూకబ్జాదారుడు అని, ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే అక్కడ జెండా పాతడమే వృత్తి అంటూ ఆరోపించారు. ఆయన క్రాంతి కిరణ్ కాదు.. కంత్రి కిరణ్ అని విమర్శించారు.
దళితుడు అయి ఉండి అసైన్డ్ భూములు, చెరువులను కబ్జా చేస్తున్నారని ఆయన తండ్రే స్వయంగా చెప్పారన్నారు షర్మిల. తన కొడుకులంతా శుంఠలు అని క్రాంతి తండ్రి చెప్పారంటూ విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు గులాబీ కార్యకర్తలు హర్టయ్యారు. ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. జోగిపేట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. క్రాంతి కిరణ్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కంప్లయింట్ చేశారు. క్షణాల్లోనే కేసు బుక్ చేశారు పోలీసులు.
ఓవైపు కేసు నమోదు అయినా.. షర్మిల మాత్రం తగ్గేదే లేదంటున్నారు. తాజాగా క్రాంతి కిరణ్ పై మరోసారి నిప్పలు చెరిగారు. తనపై నమోదైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందిస్తూ… నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు గానీ.. నేను ప్రశ్నిస్తే తప్పా? అంటూ ఎమ్మెల్యేని నిలదీశారు. ‘‘పండిత పుత్ర పరమ శుంఠ.. అని మీ నాన్నే చెప్పారు కదా! నేను చెబుతే తప్పా?’’ అని ప్రశ్నించారు షర్మిల.
ఆందోల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్నారని సొంత తండ్రే చెప్పారని అన్నారు. తాను అదే చెప్పానని.. దానికే కేసు పెడతారా? మరి మీ తండ్రిపై కూడా పెట్టారా? అంటూ చురకలంటించారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలోనైనా రాసి ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.