ప్రజాసమస్యలను తెలుసుకునేందు తాను చేస్తున్న పాదయాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటున్న నేపథ్యంలో వైయస్ షర్మిల తీవ్రవిమర్శలు చేసారు. పాదయాత్రకు వచ్చే విశేష స్పందన చూసి టీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని షర్మిల తప్పుబట్టారు. లోటస్ పాండ్ లో జరిగిన వైఎస్ఆర్టీపీ పార్టీకార్యాలయంలో జరిగిన సమావేశంలో షర్మిల మాట్లాడుతూ పాదయాత్ర చేసుకోమని హైకోర్టు అనుమతులిచ్చిన పోలీసులు అనుమతి ఇవ్వకుండా నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ వైఫల్యాలను,అవినీతిని ఎత్తిచూపేసరికి జీర్ణించుకోలేని టీఆర్ఎస్ పోలీసులను ఉపయోగించి ప్రజాసమస్యలు తెలుసేకోనివ్వకుండా తమను అడ్డుకుంటుందని పేర్కొన్నారు. తాము వ్యక్తిగత దూషణలకు ఎప్పుడూ దిగలేదని స్పష్టం చేసారు. ఒక మహిళను పట్టుకుని మరదలు,వ్రతాలంటూ కించపరచడం వ్యక్తిగత దూషణ కాదా …అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
“మా పాదయాత్రే కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని కేసీఆర్ కు స్పష్టంగా అర్థమైంది. అందుకే నా పాదయాత్రను ఎలాగైనా ఆపాలని కంకణం కట్టుకున్నారు కేసీఆర్. పోలీసుల భుజాన తుపాకిపెట్టి మా పాదయాత్రను ఆపివేయాలని చూస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు చెబుతున్నా కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ మాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.” – వైఎస్ షర్మిల, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు
కవిత ఒక మహిళై ఉండి లిక్కర్ స్కాంలో ఉండంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ నాయకులపై పబ్లిక్ ఫోరమ్ ఏర్పాటుచేసి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించకోవాలని షర్మిల ఛాలెంజ్ విసిరారు. నిజానికి నోటీసులంటూ ఇస్తే సీఎం కేసీఆర్ కే ఇవ్వాలని, ఆయనే ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని సూచించారు. టీఆర్ ఎస్ అంటే తాలీబన్ల రాష్ట్రసమితి అని యద్దేవా చేసారు. సీఎం కేసీఆర్ , ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు.
హైకోర్టు ఆర్డర్ని ఉల్లఘించినందుకు అప్పీల్ కు వెళతామని వైయస్ షర్మిల పేర్కొన్నారు. పాదయాత్రలు ఆపే పరిస్థితి వస్తే అందరివీ ఆపాలని,మరి టీబీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ పాదయాత్రను ఎందుకు ఆపలేకపోతున్నారు, నా పాదయాత్ర మాత్రమే ఎందుకు ఆపుతున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ పోలీసుల మాదిరిగా మారిపోయారని తీవ్రంగా విమర్శించారు.