తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలే బాగుపడ్డారు తప్పా.. అమరవీరుల కుటుంబాలు బాగుపడ్డట్టు ఎక్కడా లేదని ధ్వజమెత్తారు వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఆమె పర్యటించారు. మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో పర్యటించిన ఆమెకు మహిళలు పూలమాలలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం రైతు గోస దీక్షలో పాల్గొని మాట్లాడారు షర్మిల.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమంలో పాల్గొన్న వారిని కేసీఆర్ గౌరవిస్తున్నారా అని షర్మిల ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం బాగుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు అనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో ప్రాణాలనర్పించిన వీరుల కుటుంబాలకు కేసీఆర్ ఏం న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు షర్మిల. వారి త్యాగాల మీద గద్దెనెక్కిన కేసీఆర్.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకుంటే రాచరిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువకులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం అని చెప్తే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. ఎందరో వీరుల ప్రాణత్యాగాల పునాదులపైన కల్వకుంట్ల కుటుంబానికి బోగాలను అనుభవిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఓ చేతితో రైతు బంధు పేరుతో రూ. 5000 ఇచ్చి మరో చేతితో రూ. 25 వేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గడిచిన ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి పాపం కేసీఆర్ కు తప్పకుండా తగులుతోందని శపించారు.
యాసంగిలో వరి వేయొద్దన్న కేసీఆర్ మాటలు నమ్మి.. 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 8 వేల కొనుగోలు కేంద్రాలని చెప్పి.. 1000 మాత్రమే తెరిచారని మండి పడ్డారు. దిక్కుతోచని రైతులు దళారులకు రూ. 1200కే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కల్పించని సీఎం, రైతలను ఆదుకోని అధికారు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని ప్రశ్నించారు షర్మిల.