సంచలనం రేపిన జూబ్లీహిల్స్ పబ్ ఘటనపై వైటీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు దాడి చేశారు. కేసీఆర్ రాజ్యంలో ఆరేండ్ల పాపకు, పదహారేండ్ల అమ్మాయికి, అరవై ఏండ్ల బామ్మకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి వారం రోజులైనా నిందితులను పట్టుకునే దిక్కులేదని విమర్శించారు.
ఉన్నోనికి చట్టం చుట్టమైతే లేనోనికి న్యాయం బజార్లో దొరుకుతుందా? అని ప్రశ్నించారు షర్మిల. గ్యాంగ్ రేప్ లో టీఆర్ఎస్ కు చెందిన నాయకుల బంధువులు, మిత్రపక్షం ఎమ్మెల్యేల కుమారులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం? జరిగిందని నిలదీశారు. బంగారు తెలంగాణలో ఇదేనా మహిళలకు దక్కుతున్న గౌరవం అంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ, డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ ను మారుస్తూ… ఆడపిల్లల మానాలకు కేసీఆర్ రక్షణ లేకుండా చేశారని ఆరోపించారు షర్మిల. పైగా ఇప్పుడు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిలో సాదుద్దీన్ మాలిక్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఓ మైనర్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.