ఉద్యోగ నోటిఫికేషన్లపై మరోసారి టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఉన్న ఉద్యోగులకే ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక ఆస్తులు అమ్ముతోందని మండిపడ్డారు. కొత్తగా ఉద్యోగాలు ఇస్తే సీఎం సీటు అమ్ముకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా..? అందుకే ఉద్యోగాలు భర్తీ చేయడం లేదా..? లేక ఇప్పుడే ఎన్నికలు లేవని ఆగారా..? అంటూ సెటైర్లు వేశారు షర్మిల.
మరో రెండేళ్ల వరకు ఏ ఢోకా లేదులే.. తర్వాత చూద్దామనే భావనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెప్పారు షర్మిల. నాలుగున్నర లక్షల మంది టెట్ కోసం ఎదురు చేస్తున్నారని గుర్తు చేశారు. టీచర్ పోస్టులు ఎలాగూ భర్తీ చేయరు.. కనీసం ప్రైవేట్ లోనైనా నిరుద్యోగులు పని చేసుకునేందుకు వెంటనే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు ఖాళీగా ఉన్న ప్రతీ ఉద్యోగాన్ని భర్తీ చేయాలన్నారు షర్మిల.
రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించి నాలుగేళ్లు దాటింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వేల సంఖ్యలో టీచర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క తేల్చాలని సీఎస్ ను కూడా ఆదేశించారు. కానీ.. ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు.