తెలంగాణ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓవైపు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ పనిలో ఉంటే.. వైటీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తనదైన స్టయిల్ లో విమర్శల దాడికి దిగారు. ప్రతీ పథకంలో వాటా ఉందంటున్న బీజేపీ.. కేసీఆర్ అవినీతిలో వాటా లేదంటే నమ్మాలా? అని సెటైర్లు వేశారు. అవినీతి చేస్తున్నారని తెలిసి కూడా పాత మిత్రుడు కేసీఆర్ ని అరెస్ట్ చేయరని అర్థం అవుతోందని మండిపడ్డారు.
8 ఏండ్లుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిచ్చారని.. ఇక తెలంగాణలో కూడా ఇస్తారా? అని చురకలంటించారు షర్మిల. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనని మీరు.. తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా? అని నిలదీశారు. రైతులను కార్లతో గుద్ది చంపిన మీరు రైతాంగాన్ని ఆదుకుంటామని చెవిలో పూలు పెట్టొద్దని విమర్శించారు.
చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదు.. ఇక ఏ మొహం పెట్టుకొని ఒక్క చాన్స్ ఆడుగుతున్నారని నిలదీశారు షర్మిల. నిలబెట్టడం చేతకాదు గాని కూలగొట్టడంలో దిట్టలు అంటూ సెటైర్లు వేశారు. మైనార్టీలను బలి పశువులను చేసి అధికార పీఠాలను ఎక్కుతున్న మీరు.. వాళ్లకున్న 4శాతం రిజర్వేషన్ తీసేయడం కాకుండా ఇంకేం ఆలోచించగలరు? అంటూ మండిపడ్డారు.
వైఎస్ఆర్ ఇచ్చిన రిజర్వేషన్ మోడీ, షా కలిసొచ్చినా ఏం చేయలేరని అన్నారు షర్మిల. బీజేపీ మతోన్మాదాన్ని ఎదిరించగలగేది వైఎస్ఆర్ స్ఫూర్తి మాత్రమేనని చెప్పారు.