అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై స్పందించారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందేనన్నారు. ఇది వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ విజయమని చెప్పారు.
పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల పక్షాన మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు చేశామని గుర్తు చేశారు షర్మిల. పార్టీ పెట్టిన తర్వాత 17 వారాల పాటు కొనసాగించామని వివరించారు. తాము పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి వచ్చిందని విమర్శించారు. అధికారపక్షానికి కూడా బుద్ధి వచ్చిందన్నారు.
అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పే అలవాటు కేసీఆర్ కు ఉందని విమర్శించారు షర్మిల. ఇప్పుడు కూడా ఆయన మరోసారి అబద్దాలు చెప్పారన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే కేవలం 80 వేలే భర్తీ చేస్తానంటున్న సీఎం.. ఇవి కూడా నింపుతారనే గ్యారెంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు.
నోటిఫికేషన్లపై మాట ఇచ్చినంత మాత్రాన తమ పోరాటం ఆగిపోదన్నారు షర్మిల. ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసేవరకు పోరాటం సాగుతూనే ఉంటుందని… 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు నింపేవరకు, నిరుద్యోగుల పక్షాన యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు.