తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న సీఎం కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ అనే రైతు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వచ్చేవరకూ ఈ గ్రామంలోనే దీక్ష చేపడతానని ఆమె స్పష్టం చేశారు.
వరి పండించొద్దని చెప్పే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్.. తెలంగాణలో రైతులకు బతుకులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి లేఖ రాసి ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే.. ఎమ్మెల్యే వచ్చి బిచ్చమేసినట్టు 10 వేలు ఇవ్వడమేంటని మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే.. కేసీఆర్ కు దున్న పోతు మీద వాన పడినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి రైతుల ఆత్మహత్యలు కాదని.. ప్రభుత్వం చేస్తున్న హత్యలని అన్నారు. ఇన్ని ఆత్మహత్యలకు కారణమైన సీఎంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వరి కొనని సీఎం మాకొద్దని.. ఇది ఒక నినాదంగా మారాలని షర్మిల కోరారు. ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఇక్కడే దీక్ష చేస్తానని ఆమె తెలిపారు.