మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ వుంటున్న ఇంటికి అనుకోని ఒక అతిధి వచ్చింది. అది భయపెట్టే అతిధి. ఆ ఎక్స్‌పీరియెన్స్ ఎంత భయంకరమైనదో ఆమె ట్విటర్ వేదికగా అందరితో పంచుకుంది..
ఇంట్లో హాయిగా సేద తీరుతున్న వేళ.. ఇంటి కిటికీపై తిష్ట వేసుకుని ఒక పాము కనిపిస్తే.. అమ్మో ఊహించడానికే భయం వేస్తోంది కదూ. అలాంటి భయంకరమైన సన్నివేశం మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీకి ఎదురైంది. తనుంటున్న కాటేజీ కిటికీలను ఆనుకుని ఓ సర్పరాజం తచ్చాడుతుండటం సడెన్‌గా చూసి ఆమె షాకయ్యింది. మూసివేసిన కిటీకీని ఆనుకుని వెళ్తున్న ఆ పామును అంత షాక్‌లోనూ ఫోటోలు తీసి వెంటనే ట్విటర్లో పెట్టారామె. పాము కనిపిస్తే ఎంత భయమేస్తుందో కూడా ప్రణబ్ కుమార్తె నెటిజెన్లతో షేర్ చేసుకున్నారు. ‘‘జీవితంలో ఎప్పుడూ నేను ఇంత భయపడలేదు. కొండల్లో ఉండే మా ఇంటి కిటికీ అద్దాన్ని ఆనుకుని ఓ పాము పాకుతూ వెళ్లడం చూశాను. అదృష్ట వశాత్తూ కిటికీ తలుపులు బార్లా తెరిచి ఉన్న వైపు నుంచి ఆ పాము రాలేదు. బహుశా నా అరుపులు, కేకలతో భయపడి వుంటుంది. దానంతట అదే వెళ్లిపోయింది. అమ్మో.. ఇది చాలా భయంకరమైన అనుభవం..’’ అంటూ ప్రణబ్ కుమార్తె ట్విటర్‌లో చెప్పుకొచ్చారు.