తన ‘పఠాన్’ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ లో టెన్షన్ పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో సినిమాను ఆడనివ్వబోమని, దీన్ని ప్రదర్శించే థియేటర్లను తగులబెడతామని హిందూ సంఘాలు, బీజేపీ, విశ్వహిందూ పరిషద్ నేతలు హెచ్చరిస్తున్నారు, దీంతో తాజాగా షారుఖ్.. అస్సాం సీఎం హిమంత శర్మకు ఫోన్ చేశాడట. తనకు షారుఖ్ శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఫోన్ చేశాడని, తన సినిమా రిలీజ్ పై ఆందోళన వ్యక్తం చేశాడని శర్మ తెలిపారు.
అంతకుముందు ..షారుఖ్ గురించి గానీ, ఆయన సినిమా గురించి గానీ తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. షారుఖ్ ఎవరు అని ప్రశ్నించారు. రాజధాని గౌహతిలో ఈ చిత్రం ప్రదర్శించబోతున్న థియేటర్ పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేసి, ఈ సినిమా పోస్టర్లను తగులబెట్టారు. థియేటర్ లోని ఫర్నిచర్ ని నాశనం చేశారు. ఈ ఘటనపై షారుఖ్ తనకు ఫోన్ చేసినట్టు కనిపిస్తున్నదని చెప్పిన హిమంత.. తిరిగి ఇలాంటి సంఘటన జరగకుండా తమ ప్రభుత్వం చూస్తుందని ఆయనకు హామీ ఇచ్చానని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని కూడా చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 25 న ‘పఠాన్’ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకోన్ ధరించిన కాషాయ రంగు బికినీపై
మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విశ్వహిందూ, బజరంగ్ దళ్, హిందూ సేన వంటి సంస్ధలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశాయి. సిధ్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ‘బే షరమ్ రంగ్’ అనే సాంగ్ వివాదాస్పదంగా మారింది. మొత్తం మీద సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 13 ‘కత్తెరలు’ సూచించి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.