ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అస్సలు చెప్పలేం. ఇది కూడా అలాంటి ఘటనే. ఓ మీడియాలో వచ్చిన వార్తతో హీరో శర్వానంద్ మనోభావాలు దెబ్బతిన్నాయి. వెంటనే ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దిద్దుబాటు చర్యలకు దిగారు. అనుకున్నది సాధించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. శర్వానంద్ ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ బాగా జరిగింది. మంచి రిలీజ్ డేట్ కూడా దొరికింది. పైగా హిందీ మార్కెట్ కూడా బాగా జరిగింది. దీనికి సంబంధించి ఓ మీడియాలో కథనం వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ, రష్మిక వల్లనే ఈ సినిమాకు బాలీవుడ్ మార్కెట్ వచ్చిందంటూ అందులో రాసుకొచ్చారు.
ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తోంది కాబట్టి, ఆమె ఫేస్ వాల్యూ బట్టి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు హిందీ డబ్బింగ్ మార్కెట్ బాగా జరిగిందనేది ఆ కథనం సారాంశం. అది అటుఇటు తిరిగి శర్వానంద్ మొబైల్ కు చేరింది. అది చూసిన వెంటనే శర్వానంద్ హర్ట్ అయ్యాడు. సదరు మీడియా ప్రతినిధితో మాట్లాడి, మొత్తం కథనాన్ని తిరిగి రాయించాడు.
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో చాలా మంది ఫిమేల్ ఆర్టిస్టులున్నారు. హీరో మాత్రం శర్వానంద్ ఒక్కడే. కాబట్టి క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుందంటున్నాడు శర్వ. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వస్తోంది ఆడవాళ్లు మీకు జోహార్లు.