కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం ఇండస్ట్రీలో కొత్త కాదు. ప్రభుదేవా, లారెన్స్ లాంటి డాన్స్ మాస్టర్లు.. తర్వాత కాలంలో మంచి దర్శకులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో కొరియోగ్రాఫర్ చేరబోతున్నాడు. అతడే రాజు సుందరం. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు డాన్స్ కంపోజ్ చేసిన రాజు సుందరం, త్వరలోనే దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. శర్వానంద్ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు.
ఓ అందమైన ప్రేమకథ రాసుకున్నాడు రాజు సుందరం. ఈ కథను శర్వానంద్ కు వినిపించాడు. ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా పూర్తయ్యాయి. స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్. అలా రాజుసుందరం దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ కొత్త సినిమా రాబోతోంది. శర్వానంద్ కు యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు మంచి సంబంధం ఉంది. ఆ అనుబంధంతోనే శర్వా-రాజుసుందరం సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఈ బ్యానర్ ముందుకొచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది.
ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా పనిలో బిజీగా ఉన్నాడు శర్వానంద్. మార్చి 4న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా తర్వాత అతడు నటించిన ఒకే ఒక జీవితం అనే మరో సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను మే లేదా జూన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత శర్వానంద్ నుంచి రాబోయే చిత్రం రాజు సుందరందే.