రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగం పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల ప్రసంగం మాదిరే ఉందని ఈ పార్టీ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. ప్రధాని మోడీ నేతృత్వం లోని బీజేపీ తిరిగి మూడోసారి కూడా .. 2024 లో అధికారం లోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు గానీ ..ఆమె ద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం చేయించినట్టు ఈ స్పీచ్ ఉందని ఆయన చెప్పారు.
ప్రతిదానికీ ప్రభుత్వాన్ని ప్రశంసించే ప్రయత్నం ఈ ప్రసంగంలో కనిపించిందని, సర్కార్ వైఫల్యాల ప్రస్తావన అసలే లేదని ఆయన ఆరోపించారు. వాటిని కామ్ గా ఈ స్పీచ్ లో ‘స్కిప్’ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఇలాగే స్పందించారు. అసలు ప్రస్తావించవలసిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని తాము పార్లమెంటులో వరుసగా లేవనెత్తుతామని లోక్ సభలో పార్టీ నేత కూడా అయిన చౌదరి తెలిపారు.
దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. ఇక భారత ప్రభుత్వం రాసిన స్క్రిప్టునే రాష్ట్రపతి చదివారని తృణమూల్ కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ఈ పార్టీ ఫ్లోర్ లీడర్ డెరెక్ ఓ బ్రీన్ ట్వీట్ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించడం, ఉద్యోగాల కల్పన, మతసామరస్య పరిరక్షణ, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి ఎన్నో అంశాలను రాష్ట్రపతి ప్రస్తావించలేదన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ కేకే సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము విన్నామని, కానీ నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాల ప్రస్తావన లేదన్నారు. ‘అదానీ యాక్ట్’ అనే చట్టాన్ని తేవాలని ప్రధానికి సలహా ఇవ్వాలని తాము రాష్ట్రపతిని కోరుతున్నామని చెప్పిన ఆయన, ఇప్పుడు ‘క్రోనీ కేపిటలిజం’ అన్నదొకటే ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.