కార్గిల్ యుద్ధంతో ఇండియాను రెచ్చగొట్టిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ..శాంతికాముకుడని ప్రశంసించారు. ఒకప్పుడు ముషారఫ్ ఇండియాకు శత్రువేనని, కానీ ఆ తరువాత శాంతికి నిజమైన ‘శక్తి’గా మారారని ఆయన అన్నారు. ముషారఫ్ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేస్తూ.. 2002-2007 మధ్య ముషారఫ్ ఇలా శాంతి మంత్రం జపించారన్నారు.
తాను లోగడ ఐక్యరాజ్యసమితి సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో ముషారఫ్ ఆలోచనా విధానాలకు ఎంతో ప్రభావితుడినయ్యేవాడినని థరూర్ ట్వీట్ చేశారు. ఆ రోజుల్లో నేను ఆయనను తరచూ కలుస్తూ ఉండేవాడిని.. ఆయన వ్యూహాత్మక విధానం నాకెంతో నచ్చింది అని థరూర్ తెలిపారు.
అయితే దీనిపై బీజేపీ వెంటనే స్పందించింది. మీ పార్టీ నేత రాహుల్ గాంధీని ఒకనాడు ముషారఫ్ జెంటిల్ మన్ గా పొగిడినందుకే మీరిలా ఆయనను సమర్థిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా విమర్శించారు. నాడు ఒసామా బిన్ లాడెన్ ను, తాలిబన్ ను ప్రశంసించిన ముషారఫ్ .. రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చూడాలనుకుంటున్నానని వ్యాఖ్యానించినందుకే మీరిప్పుడు ఆయనను ఆకాశానికెత్తుతున్నారని కౌంటరిచ్చారు.
బాలాకోట్ దాడులపై అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ముషారఫ్ ని పొగడడంలో వింత ఏమీ లేదని పూనావాలా పేర్కొన్నారు. భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండా అని కూడా మీ పార్టీ విమర్శించిందని ఆయన అన్నారు. ‘ముషారఫ్ కార్గిల్ యుద్దానికి కారకుడు. నియంత.. అమానుష నేరాల్లో నిందితుడు.. తన సొంత సైనికుల మృతదేహాలను తీసుకువెళ్ళడానికి కూడా తిరస్కరించారు.’ అని పూనావాలా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి పాక్ పై ఉన్న భక్తి భావన శశిథరూర్ ట్వీట్ ద్వారా స్పష్టమవుతోందని పూనావాలా ట్వీట్ చేశారు. 2019 లో లోక్ సభ ఎన్నికలకు ముందు ముషారఫ్ .. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాలని కోరుతున్నానని చెప్పారు. మోడీ శాంతి, సుస్థిరతలకు తగిన వ్యక్తి కాదన్నారు.