తన పట్ల కాంగ్రెస్ నేతలు వివక్షచూపుతున్నారని పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శశిథరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు నివ్వాలని కోరేందుకు ప్రచారం కోసం తాను రాష్ట్రాలకు వెళ్తే పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇతర నాయకులు తనకు అందుబాటులో ఉండడం లేదన్నారు. నాకన్నా నా ప్రత్యర్థి మల్లిఖార్జున్ ఖర్గే పట్లే వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ ట్రీట్ మెంట్ ఎలా ఉంటోందో మీరు గమనిస్తున్నారు కదా అని మీడియాను ఉద్దేశించి అన్నారు.
ఖర్గేకు వారంతా ఘన స్వాగతం పలుకుతున్నారని, ఆయనతో కలిసి కూర్చుని మాట్లాడుతున్నారని థరూర్ చెప్పారు. ఇదంతా ఒక అభ్యర్థికి మాత్రమే జరుగుతోందని, తనకు మాత్రం ఇలాంటిది దక్కడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల మీద నేనేమీ ఫిర్యాదు చేయడం లేదు.. కానీ ఈ తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు.
సోమవారం జరిగే పోలింగ్ కి సంబంధించి పార్టీ డెలిగేట్ల జాబితా తనకు అందినప్పటికీ అది అసంపూర్తిగా ఉందని చెప్పారు. పైగా ఈ లిస్టులోని వారి ఫోన్ నెంబర్లు కూడా లేవన్నారు. ‘నాకు రెండు జాబితాలు అందాయి. మొదటి దానిలో ఫోన్ నెంబర్లు లేవు. నేనెలా కాంటాక్ట్ చేయాలి అని ఆయన ప్రశ్నించారు. ఇది నేను కావాలని చెబుతున్నది కాదు.. 22 ఏళ్లుగా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగలేదు. కొన్ని వైఫల్యాలు ఉన్నాయి’ అన్నారాయన.
మధుసూదన్ మిస్త్రీ, ఆయన టీమ్.. ఈ ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని, వారి మీద తనకెలాంటి ఫిర్యాదు లేదని థరూర్ చెప్పారు. నేను మీడియా మీదే ఆధారపడుతున్నా అని పేర్కొన్నారు. వారే నా మేనిఫెస్టోను పార్టీ నేతలకు తెలియజేస్తారన్నారు.