అక్రమాస్తుల కేసులో ఊచలు లెక్కపెట్టి, ఇటీవలే జైలు నుండి విడుదలైన తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త ఎత్తులు వేస్తున్నారు. తను అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అవినీతి నిరోధక చట్టం-1988 ప్రకారం ఆమె జైలు నుండి భయటకొచ్చిన మరో ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు.
దీంతో పోటీకి అనర్హురాలు కాకుండా ఉండేందుకకు శశికళ, ఆమె న్యాయవాదులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గతంలో సిక్కిం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్ సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించారు. 2018లో విడుదలైన ఆయనకు కూడా ఆరు సంవత్సరాల పోటీకి అనర్హుడు అనే నిబంధన ఉంది. కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందటమే కాదు ఏకంగా సీఎం అయ్యారు.
1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ, 1951, సెక్షన్ 11 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పోటీచేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే, అందుకు ఎన్నికల సంఘం అనుమతించాల్సి ఉంటుంది. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అవసరం అయితే సుప్రీంకు వెళ్లైనా సరే పోటీకి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని శశికళ వర్గం భావిస్తుంది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఏఐడీఎంకే తరుపున తానే సీఎం అభ్యర్థిగా ఉండాలని శశికళ డిసైడ్ అయినట్లు తమిళనాడు రాజకీయ వర్గాలంటున్నాయి.